Dr.YSR.Polam badi 10 formulas | డా౹౹ వై.ఎస్.ఆర్..పొలంబడి లో 10 ముఖ్య సూత్రాలు | What is YSR Polambadi | raithubadi
YSR POLAM BADI |
Dr.YSR.Polambadi - డా౹౹ వై.ఎస్.ఆర్.పొలంబడి
వ్యవసాయం లో చీడ, పీడలను అరికట్టుటకు ఇష్టానుసారంగా రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వినియోగము వలన సాగుఖర్చులతో పాటు నాణ్యతలేని ఉత్పత్తులు పెరగటానికి దారి తీస్తున్నది. ఫలితంగా తక్కువ మార్కెట్ రేటు, తక్కువ లాభాలు వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి రైతులకు శిక్షణ ఇవ్వటానికి ' డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి' అనే పథకాన్ని రూపొందించినారు.
డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి అంటే ఏమిటి?
ఒక రైతు పొలంలో 30 మంది రైతులను సమావేశ పరిచి, పంటల్లోని వివిధ మార్పులను క్షుణ్ణంగా పరిశీలించి, వారు ఆ పరిశీలనల పై చర్చించి, సమగ్ర పంటల యాజమాన్యాన్ని అమలు పరుస్తూ, ఆర్థికంగా తగు లాభదాయకమైన నిర్ణయాలను తీసుకుని" శాస్త్రీయ మైన సేంద్రీయ వ్యవసాయం" దిశగా పయనిస్తూ, రైతులు తమ సాధికారత ను సాధించుటయే డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి.
ఈ పొలంబడి లో భాగంగా రైతులు చేపట్టే ఈ సమగ్ర పంటల యాజమాన్యం లో ఉత్తమమైన, పర్యావరణ హితమైన శాస్త్రీయ వ్యవసాయ పద్దతుల్ని ఆచరించి సాగు ఖర్చు తగ్గించడమే గాక, పంటల ఉత్పత్తులను పెంచడం జరుగుతుంది.
డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి ఎందుకు ?
సమగ్ర పంటల యాజమాన్యం / సమగ్ర సస్యరక్షణ లో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి తద్వారా సాగు ఖర్చు తగ్గించుట, పంట దిగుబడులు స్థిరీకరించుట, పర్యావరణాన్ని రక్షించుట, నిర్ణయాత్మక శక్తిగా రైతులను సాధికార పరిచి, తద్వారా శాస్త్రీయంగా నిష్టాతుని చేసి సహజ సిద్ధంగా లభించే వృక్ష సంబంధ ఉత్పత్తులను ఉపయోగించుటయే ఈ పొలంబడి ముఖ్యఉద్దేశ్యం.
డా౹౹వై.ఎస్.ఆర్.పొలంబడి ఎక్కడ? ఎలా?
ఈ పొలంబడులకు చుట్టూ గోడలు గాని, పైకప్పుగాని ఉండవు. రైతుల పొలాలే బడులు, పొలం గట్టులే గోడలు, రైతులే విద్యార్థులు. ఈ కార్యక్రమం ఒక పంటలో 14 వారాలు అనగా, పంటకాలం పాటు సాగుతుంది. తరగతి గది పొలము, తరగతులు వారానికి 4 రోజులు. వ్యవసాయ సమగ్ర పంటల సాగు పద్దతులలో నిష్టాతులైన వ్యవసాయ శిక్షకులు అంటే వ్యవసాయ అధికారులు లేదా పొలంబడిలో సుశిక్షుతులైన రైతులు లేదా గ్రామ వ్యవసాయ సహాయకులు అధ్యాపకులు గా వ్యవహరిస్తారు.
Dr.YSR.Polam badi 10 formulas
- తక్కువ పెట్టుబడి తో ఎక్కువ నికరాదాయం, నాణ్యమైన దిగుబడి పొందుట
- సహజ సిద్ధమైన వనరులతో సాగు చేయుట.
- భూసార పరీక్షను బట్టి ఎరువులు వాడుట.
- వానపాములు, సేంద్రీయ ఎరువులు వాడుట - రసాయన ఎరువులు తగ్గించుట.
- విత్తన శుద్ధితో చీడపీడలను నివారించుట.
- అంతర పంటల ద్వారా మిత్ర పురుగుల వృద్ధి చేయుట.
- ఎర పంటలు, లింగాకర్షక ఎరలను వాడి పురుగుల ఉనికిని గమనించుట.
- బ్యాక్టీరియా, వైరస్ సంబంధిత మందులు, వేపగింజల కషాయంతో శత్రు పురుగులను నివారించుట.
- రసాయనిక పురుగు మందుల వాడకం తగ్గించుట.
- పర్యావరణాన్ని పరిరక్షించుట.
పొలంబడి శిక్షణ కు ముందు చేయవలసిన పని
పొలంబడి మొదటి సమావేశం కొరకు 4000-8000 చ.మీ. పొలాన్ని, విత్తన క్షేత్ర తయారీ మరియు నారుతో సమాయత్తం చేయాలి. పొలంబడి నిర్వహించే గ్రామంలోని రైతులందరిని కలిసి వారికి పొలంబడి కార్యక్రమాలు వివరించి, పాల్గొనేవారి పేర్లు నమోదు చేయాలి. పొలంబడి లో పాల్గొనే రైతులందరికి సులభంగా అందుబాటులో ఉండేలా 4000 నుండి 8000 చ.మీ. వైశాల్యం గల అధ్యయన క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి.
పొలంబడి శిక్షణా స్థలాన్ని ఎంచుకోవడం
- పొలంబడి రైతుల అంగీకారం తో తక్కువలో తక్కువ 2 ఎకరాలు లేదా 3 ఎకరాల స్థలాన్ని ఎన్నుకోవాలి.
- ఎంచుకునే పొలము పొలంబడి లో చేరే రైతులలో ఒకరిదై ఉండాలి.
- ఇది అందరికీ దగ్గరలోను, గ్రామానికి దగ్గర గా కూడా ఉండాలి.
- గ్రూపులుగా పనిచేసే , రైతులందరికీ సరిపోయేంత నీడగల ప్రదేశము పొలానికి సమీపంలో ఉండాలి.
- పొలంలో నీరు నిలువరాదు.
- పొలంలో అసాధారణ అంశాలు ఏమి ఉండరాదు. (ఒప్పులు, ఒట్టెలు లాంటివి)
- క్షేత్ర ప్రయోగాలకు మరియు వ్యవసాయ పర్యావరణ విశ్లేషణ నేలను ఇవ్వడానికి సిద్ధపడుతున్న రైతును ఎంచుకోవాలి.
- ఆ రైతు వ్యవసాయ జీవావరణ విశ్లేషణ(ఎ. ఇ. ఎస్.ఏ) తీసుకున్న నిర్ణయాల ప్రకారం, సమగ్ర పంట యాజమాన్య ప్లాటులో, పొలం పనులు చేయటానికి అంగీకరించాలి.
- రైతు పద్ధతుల పొలంలో, రైతులంతా కలిసి తుది నిర్ణయం తీసుకున్న పొలం పనులు కాలపట్టికను అమలు చేయడానికి ఒప్పుకోవాలి.
- సమగ్ర సస్యరక్షణ లో భాగంగా చీడపీడల యాజమాన్యానికి కావలసిన పురుగుమందుల ఖర్చు తప్ప, రెండు పొలాల నిర్వహణకు అయే ఖర్చునంతా భరించడానికి ఒప్పుకోవాలి.
- పాల్గొనే రైతులంతా తన పొలంలో పనిచేయడానికి మరియు "ఫీల్డ్ డే" (క్షేత్ర దినోత్సవం) ఏర్పాటు చేయడానికి ఒప్పుకోవాలి.
Post a Comment